మోటార్ మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి

నీటి వినియోగంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: దేవాదుల ఎత్తిపోతల పథకంలో మరమ్మతులకు గురైన పని చేయని మోటార్‌ను అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత వర్షపాతం పరిస్థితులు, సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

సోమవారం కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టులో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతల ప్రక్రియ, మోటార్ల పనితీరు, మరమ్మతులో ఉన్న మోటార్ పురోగతి, నీటి సరఫరా పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం తొమ్మిది మోటార్లు 24 గంటలపాటు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మరమ్మతులో ఉన్న మరో మోటార్‌ను మేఘా సంస్థ సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారని, మెకానికల్ సీల్ వద్ద తలెత్తిన లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన కలెక్టర్ మెకానికల్ సీల్‌ను పూర్తిగా పరిశీలించి లోపాన్ని ఖచ్చితంగా గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మోటార్‌ను త్వరితగతిన పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత శాఖ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు.

రానున్న రోజుల్లో వర్షపాతం, నీటి లభ్యత, తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ్మోహన్, డీఈ శరత్, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.