కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కుప్పకూలుస్తాం
కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కుప్పకూలుస్తాం
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలే తప్ప.. ప్రజాస్వామ్య పాలన కాదు
ఒకటే నేరారోపణ…36 కేసులు
మాజీ మంత్రి అంబటి రాంబాబు
పులివెందుల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కక్ష సాధింపులే సాధింపు రాజకీయాలే తప్ప,ప్రజాస్వామ్య పాలన కాదని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కుప్పకూలుస్తామని మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై దూషించారని నిందారోపణపై విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించానని సాయి భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారని, అందులో భాగంగా విచారణకు హాజరైనట్లు ఆయన తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపాను అన్నారు.
జనవరి 31న చంద్రబాబు నాయుడు ను దూషించినందుకు తనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. జైలులో 18 రోజులు రిమాండ్ లో ఉంచి బయలు పై విడుదల అయ్యానని అయితే ఒకటే ఆ నేరఆరోపణ తో తనపై 36 కేసులు నమోదు చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కోర్టు ఆర్డర్ ను ధిక్కరించి తనను చట్ట వ్యతిరేకంగా విచారిస్తున్నారని, వీరిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు ముందు నిలబెడతానన్నారు.
చంద్రబాబు, లోకేష్ బాబుల ఆదేశాల మేరకు డిజిపి డైరెక్షన్ లో తనను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నో అక్రమ కేసులు బనాయించి తనను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చట్టం చంద్రబాబుకు ఒకరకంగా జగన్ కు ఒకరకంగా ఉందన్నారు. చంద్రబాబును దూషిస్తే కేసులు జగన్ ను దూషిస్తే కేసులు పెట్టరా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను చంద్రబాబును దూషించానని కేసులు నమోదు చేసి జైలుకు పంపి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు తన ఇంటిని, ఫర్నిచర్,కారు ధ్వంసం చేస్తే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు.
చట్టం తెలుగుదేశం నాయకులకు చుట్టంగా మారిందన్నారు. అన్ని గమనిస్తున్నామని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో కష్టాలు పడతామని,మరలా వైకాపా పార్టీ అధికారం వచ్చాక బదులు తీర్చుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కుప్పకూలుస్తామని ఆయన అన్నారు.రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలే తప్ప,ప్రజాస్వామ్య పాలన కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
