ఏపీఎల్‌లో రాయలసీమ రాయల్ విన్.. వైజాగ్ విజయభేరి
అభిషేక్ సెంచరీ వృథా.. అమరావతికి తొలి ఓటమి
కడప డబుల్ హెడర్‌లో అభిమానులకు క్రికెట్ వినోదం
కడప, ఆంధ్రప్రభ: ఏపీఎల్-2026 సీజన్-5లో భాగంగా కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ అద్భుత విజయాన్ని నమోదు చేయగా, రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో క్యాపిటల్ అమరావతి రాయల్స్‌కు సీజన్‌లో తొలి ఓటమిని రుచి చూపించింది.
కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ అద్భుత శతకంతో చెలరేగి 60 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో లేకాజ్ రెడ్డి 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపులు మెరిపించడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. రాయలసీమ బౌలర్లలో పార్థసారథి, పురుషోత్తం గణేష్ చెరో రెండు వికెట్లు తీశారు.
212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమకు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. జీఎస్పీ తేజ 43 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్‌ను మలుపుతిప్పగా, వై వాసు 14 బంతుల్లోనే 42 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. వై తేజారెడ్డి 41 పరుగులతో అండగా నిలిచాడు. దీంతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ 18.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇదే తొలి విజయం.
డబుల్ హెడర్‌లో రెండో మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన వైజాగ్ లయన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్‌లో హనీష్ వీరారెడ్డి 34 బంతుల్లో 62 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. మహిప్ కుమార్ కూడా 62 పరుగులతో రాణించగా, చివర్లో ధనుష్ 14 బంతుల్లో 36 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. అమరావతి బౌలర్లలో టోషిత్ యాదవ్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాపిటల్ అమరావతి రాయల్స్‌కు వైజాగ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ 42, గిరినాథ్ 37 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయిన అమరావతి 19 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటై 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వైజాగ్ బౌలర్లలో ప్రమోద్ మూడు వికెట్లు, గిరినాథ్ మూడు వికెట్లు తీసి అమరావతి బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.
