మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మాదక ద్రవ్యాలకు నో చెప్పండి…
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అవును చెప్పండి.
విజయవాడసెంట్రల్, ఆంధ్రప్రభ : బి.ఆర్. టి. ఎస్ రోడ్డు నందు జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శారద కళాశాల విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఎంతో సంతోషకరమని నవజీవన్ బాలభవన్ సమస్త డైరెక్టర్ తంబి తెలిపారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఈగల్ విభాగం సంయుక్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. మన సమాజంలో ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే ఈగల్ విభాగం టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని కోరారు.
మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో శారద కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, ఈగల్ విభాగం అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది, నవజీవన్ బాలభవన్ సమస్త ప్రోగ్రామ్ మేనేజర్ శేఖర్, సి. హెచ్ రఘు, ఓర్సు మస్తాన్ సిబ్బంది, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
