పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ శ్రీమంతం

పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ శ్రీమంతం

ఘనంగా మహిళా కానిస్టేబుల్ రమ్యకు..
పుట్టింటి వాతావరణం లో వేడుక
సీఐ గుణారం దంపతుల ఉదారత

భవానిపురం, ఆంధ్రప్రభ : పోలీస్ శాఖలో కఠినమైన విధులు నిర్వహిస్తూనే మానవీయ విలువలను చాటిచెప్పే అరుదైన ఘటన విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది రమ్యకు వన్‌టౌన్ సీఐ గుణారం, ఆయన సతీమణి స్వయంగా ముందుండి ఘనంగా శ్రీమంతం నిర్వహించి కుటుంబ సభ్యుల ఆప్యాయతను అందించారు. సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన శ్రీమంత వేడుకను స్టేషన్ సిబ్బంది అంతా కలిసి నిర్వహించడం అక్కడ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించింది.

రమ్యను తమ కుటుంబ సభ్యురాలిగా భావించి సీఐ గుణారం దంపతులు ఆశీర్వదించగా, సహచర సిబ్బంది సైతం ఆనందోత్సాహాల మధ్య వేడుకలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో సహోద్యోగుల సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తున్న పోలీసు శాఖలో ఇటువంటి కార్యక్రమాలు సిబ్బందిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళా సిబ్బందికి తాము ఒంటరిగా లేమనే భరోసా కల్పించేలా ఈ కార్యక్రమం నిలిచిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో మహిళా సిబ్బంది సంక్షేమం, గౌరవానికి పెద్దపీట వేస్తున్న విధానాలకు ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన పలువురు ఈ దృశ్యాలను చూసి ప్రశంసలు కురిపించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మానవీయ విలువలను కూడా సమానంగా పాటిస్తున్న పోలీసు వ్యవస్థకు ఇది మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు. సీఐ గుణారం తన పేరుకు తగ్గట్టుగానే సద్గుణాలతో వ్యవహరిస్తూ సహచర సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని సిబ్బంది కొనియాడారు. రమ్యకు పుట్టింటి వాతావరణాన్ని గుర్తు చేసేలా నిర్వహించిన ఈ శ్రీమంత వేడుక స్టేషన్‌లో పనిచేస్తున్న వారందరిలోనూ ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన రమ్య, తన జీవితంలో మరపురాని ఘట్టంగా ఈ వేడుక నిలిచిపోతుందని పేర్కొన్నారు.

తాను పనిచేస్తున్న స్టేషన్‌లోనే కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో శ్రీమంతం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. సీఐ గుణారం దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు, స్థానిక ప్రముఖులు సీఐ గుణారం దంపతుల మానవీయ చర్యను అభినందిస్తూ మహిళా సిబ్బందిపట్ల చూపిన ఆప్యాయతకు ప్రశంసలు కురిపించారు.

Leave a Reply