టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం

టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం

  • సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు
  • వేసవిలో తాటి ముంజల ఎంట్రీ
  • మిల మిల మెరిసే ముత్యపు చిప్పల తాటి ముంజలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పొడవైన తాటి చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ ప్రాంతం ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. చెట్ల నుంచి కల్లు గీసి విక్రయిస్తూ గీత కార్మికులు ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నారు.

వేసవి ప్రారంభంతో మండే ఎండలకు విరుగుడుగా తాటిముంజలు మార్కెట్‌లోకి వచ్చాయి. తాటిముంజలు, నీటిముంజలు, పాలముంజలు అనే పేర్లతో పిలిచే ఈ పండ్లు పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముత్యాల్లా మెరిసే ఈ ముంజలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

తెలంగాణలో తాటికల్లుకు ఉన్న ప్రాధాన్యం ఎంతైతే, తాటి ముంజలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయంగా “ఐస్ ఆపిల్స్”గా పేరుపొందిన ఈ పండ్లు ఆపిల్‌కు సమానంగా గుర్తింపు పొందాయి.

వైద్యుల ప్రకారం, తాటి ముంజలు వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చి తాపాన్ని తగ్గిస్తాయి. ఇందులో అధికంగా నీరు (సుమారు 87%), కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు తాటి ముంజలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారికి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు బలరాం మాట్లాడుతూ, తాటి ముంజల్లో నీరు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.

Leave a Reply