ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలు..

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరంలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలను సోమవారం ఉత్సాహభరితంగా నిర్వహించినట్లు పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో పటిష్టమైనదని, నేటి విద్యార్థులే భావి భారత ఆశాకిరణాలని అన్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే పాఠశాలలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నామని తెలిపారు.

ఎన్నికలకు ముందే ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రజాస్వామ్యం, ఓటు విలువ, సమర్థత, నిస్వార్థ సేవాభావం కలిగిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించి, ఉత్తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని తెలిపారు.

పాఠశాల ప్రిన్సిపాల్ లతా గౌడ్ మాట్లాడుతూ, స్కూల్ పీపుల్ లీడర్, స్కూల్ అసిస్టెంట్ పీపుల్ లీడర్, స్కూల్ గేమ్స్ లీడర్, స్కూల్ కల్చరల్ లీడర్, స్కూల్ గ్రూప్ లీడర్ తదితర పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు రాజకీయ పార్టీల తరహాలో రెడ్ వారియర్స్, ఎల్లో అలయన్స్, గ్రీన్ జీన్స్, పింక్ పాంథర్స్ పేర్లతో ఏర్పాటైన బృందాల తరఫున పోటీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.