ప్రభుత్వ అసమర్థతతోనే డీజిల్ కొరత…

ప్రభుత్వ అసమర్థతతోనే డీజిల్ కొరత…

ప్రభుత్వానికి చేతకాకనే ఇంధన సంక్షోభం..
వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్..
విజయవాడలో పెట్రోల్ బంక్ వద్ద వైసీపీ ఆందోళన..
ఆటోలతో భారీ ర్యాలీ..
పెట్రోల్, డీజిల్ సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ..
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక..

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కూటమి ప్రభుత్వమే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలో ఇంధన కొరతపై నిరసనలు చెలరేగాయి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడ లోని దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించిన ఈ నిరసనలో దేవినేని అవినాష్ ఆటోలో ర్యాలీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, కూటమికి ఓట్లు వేసిన ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ వంటి ప్రాథమిక అవసరాల సరఫరాలో కూడా ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. రైతులు యూరియా కోసం, వృద్ధులు పింఛన్ల కోసం, మహిళలు రేషన్ కోసం క్యూలో నిలబడుతున్నారని, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు లేకపోవడంతో రేషన్ విధానం అమలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు, రోజువారీ కూలీలు ఇంధన కొరత వల్ల జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.