వ్యసన విముక్తి ప్రతిజ్ఞ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని
వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
హనుమకొండ, ఆంధ్రప్రభ : బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం పోస్టర్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నశా ముక్త్ భారత్ అభియాన్ (వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర)లో భాగంగా వ్యసనాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వంటి వ్యసనాలు వ్యక్తుల ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ముఖ్యంగా యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు చెందిన బీకే విమల, శోభ, కల్పన, అనిల్, రాఘవచారి, శ్యామ్, అరుణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
