Pension | బతికుండగానే చంపేశారు…

Pension | బతికుండగానే చంపేశారు…
రఘునాథపాలెం, ఆంధ్రప్రభ : పై ఫోటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కొండ్రు రాములమ్మ. భర్త మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు పింఛన్ మంజూరు చేస్తుందని ఆశతో ఎదురుచూస్తోంది. జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో, తనకూ తప్పకుండా పింఛన్ వస్తుందని నమ్మకంతో ఉంది.
ఈ నేపథ్యంలో గ్రామంలోని అధికార పార్టీ నాయకుడిని కలిసి తన పింఛన్ దరఖాస్తు స్థితి గురించి ఆరా తీసింది. దీంతో సదరు నాయకుడు రాములమ్మ ఆధార్ వివరాలు తీసుకుని మండల పరిషత్ కార్యాలయంలో పింఛన్ దరఖాస్తు వివరాలను పరిశీలించాడు. అయితే పింఛన్ వెబ్సైట్లో స్టేటస్ చూడగా ఆ నాయకుడు అవాక్కయ్యాడు. పింఛన్ మంజూరైన జాబితాలో రాములమ్మ పేరు లేకపోవడమే కాకుండా, ఆమె స్టేటస్ “డెత్” గా నమోదు చేసినట్లు గుర్తించాడు.
బతికుండగానే చంపేశారేంటి సారు.. అంటూ కార్యాలయ ఉద్యోగిని ఆ నాయకుడు ప్రశ్నించాడు. కనీసం సైట్ నుంచి ఆ పేరు తొలగించి.. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి వృద్ధురాలికి న్యాయం చేయమని కోరాడు. అయితే, సదరు అధికారి సైట్ లో డిలీషన్ అవకాశం లేదంటూ చెప్పడంతో నాయకుడు కంగుతున్నాడు.
ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలో వితంతు, వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్ల కోసం వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అనేక దరఖాస్తులు ఆన్లైన్లో సక్రమంగా నమోదు కాలేదని ఆరోపిస్తున్నారు.
మండల కేంద్రం రఘునాథపాలెంకు చెందిన కొండ్రు రాములమ్మ విషయంలో జరిగిన ఈ పొరపాటు, పింఛన్ కోసం దరఖాస్తు చేసిన ఇతర లబ్ధిదారుల పరిస్థితిపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా, దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే “సర్వర్ సమస్య” ఉందని చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్ దరఖాస్తులను స్వీకరిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వారు కోరుతున్నారు.
