గోపగోని సుజాత ఆశయాలను సాధిస్తాం…
ఘనంగా నాలుగో వర్ధంతి వేడుకలు..
రోగులకు పండ్లు, చిన్నారులకు టిఫిన్ బాక్సులు పంపిణీ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు గోపగోని సుజాత నాలుగవ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఆమెకు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని ఆమె స్మారక స్తూపం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం, పేద ప్రజల హక్కుల కోసం గోపగోని సుజాత చేసిన సేవలు ఎనలేనివని, ఆమె నిస్వార్థ సేవలు ఎందరికో ఆదర్శప్రాయమని కొనియాడారు. సుజాత ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, హక్కుల సాధన కోసం సీపీఎం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. గోపగోని సుజాత వర్ధంతిని పురస్కరించుకుని సీపీఎం శ్రేణులు పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి పరామర్శించారు. చౌటుప్పల్ 17వ వార్డులోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడి చిన్నారులకు టిఫిన్ బాక్సులను అందజేసి వారి పట్ల తమకున్న సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమాలలో సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, నాయకులు బత్తుల దాసు, దండా అరుణ్ కుమార్, ఉస్కాగుల రమేష్, బండారు నరసింహ, ఉష్కాగుల శ్రీను, ఆకుల ధర్మయ్య, తూర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, బత్తుల రమేష్, ఎండీ ఖయ్యూం, బొడ్డు అంజిరెడ్డి, ఎండీ కాసిం, వెల్తురు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
