ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే మహోత్సవంలో..

ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే మహోత్సవంలో..


మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా జయశంకర్ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. నాసిక్‌కు చెందిన మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్ శనివారం ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సరస్వతి నదిలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహారాజ్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.

తదుపరి పార్వతి (శుభానంద) దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో భక్తులను ఉద్దేశించి మహారాజ్ ధార్మిక సందేశం అందించారు. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే మహోత్సవమని పేర్కొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాలను మహారాజ్‌కు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఆర్జేసీ రామకృష్ణ, ఈవో మహేష్, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply