వర్షాభావ పరిస్థితుల్లో పంట మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించాలి..

… పంట మార్పిడిపై రైతులకు అవగాహన

కేసముద్రం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం నెలకొన్న నేపథ్యంలో తీవ్రమైన
వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని అందుకు అనుగుణంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలనీ కేసముద్రం మండల వ్యవసాయ అధికారి వెంకన్న సూచించారు. బుధవారం కేసముద్రం మండలంలోని పలు గ్రామాలలో మహమూద్ పట్నం భూక్యా రామ్ తండా, తాళ్లపూసపల్లి, పెదమోరి తండా, కేసముద్రం రైతు వేదికలో వానకాలం 2026- 27 సీజన్లో సాగు చేసే పంటల మీద వాతావరణ శాఖ ఆదేశాల మేరకు పంట మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ అధికారి వెంకన్న మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంబంధించి సకాలంలో వర్షాలు కురిసే అవకాశం లేనందున, సెప్టెంబర్ మాసం చివరివరకు వర్షపాతం తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నందున రైతు సోదరులు నీటి వసతి కింద సాగు చేసే వరిని తగ్గించి, బోర్ల కింద, బావుల కింద, చెరువుల కింద, వరి విస్తీర్ణాన్ని తగ్గించి పంట మార్పిడి విధానాన్ని అవలంబిం చలన్నారు. మెట్ట పంటలు, తక్కువ నీటితో సాగుచేసే పెసర, మినుములు, కందులు జొన్నలు, సజ్జలు, రాగులు, కూరగాయల పంటల సాగులను సాగు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాకాలం సీజన్ లో వేసినటువంటి పత్తి మొక్కజొన్న, పంటలకు అడపాదనప నీటి తడులు ఇచ్చి పంటలను రక్షించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారి విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారులు, వి లావణ్య, కేఎల్ శ్రీకాంత్, రాజీవ్ , ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.