గ్రేవ్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి..
- పటాన్చెరు డీఎస్పీ కార్యాలయ తనిఖీలో ఎస్పీ పరితోష్ పంకజ్
- కమ్యూనిటీ పోలీసింగ్పై దృష్టి పెట్టాలని సూచన
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ బుధవారం పటాన్చెరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్క నాటిన ఎస్పీ, అనంతరం కార్యాలయ రికార్డులు, దర్యాప్తులో ఉన్న కీలక కేసులను పరిశీలించి వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచారం, డౌరీ డెత్ వంటి గ్రేవ్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్కు ఆనుకుని ఉన్న పటాన్చెరు సబ్ డివిజన్లో ఉద్యోగులు, కార్మికుల రాకపోకలతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని, పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో వలస కార్మికుల సంఖ్య కూడా అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించి పగలు, రాత్రి బీట్లను బలోపేతం చేసేలా సబ్ డివిజన్ పరిధిలోని ఎస్హెచ్వోలకు తగిన సూచనలు చేయాలని డీఎస్పీని ఆదేశించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని, గ్రామాల్లో నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నేరాల నివారణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ ప్రజల్లో వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించి గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్హెచ్వోలకు మార్గనిర్దేశం చేయాలని, తనిఖీ నివేదికలను సకాలంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ప్రతి రికార్డు సీసీటీఎన్ఎస్లో నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. డీఎస్పీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ తనిఖీలో పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్తో పాటు పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసు అధికారులు, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
