ICC | ప్రపంచకప్‌లకు కొత్త ఫార్మాట్..
- 2027 వన్డే ప్రపంచకప్‌లో మూడు దశల పోరు
- 2028 టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్-10’.. కొత్తగా ఎలిమినేటర్లు
- పోటీ మరింత పెంచేందుకే మార్పులంటున్న ఐసీసీ
ఆంధ్రప్రభ, క్రీడా విభాగం : ప్రపంచకప్ టోర్నీల స్వరూపాన్ని మార్చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్, 2028 పురుషుల టీ20 ప్రపంచకప్ పోటీ విధానాల్లో భారీ మార్పులకు ఆమోదం తెలిపింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐసీసీ బోర్డు ఈ కొత్త విధానాలకు పచ్చజెండా ఊపింది. ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం పెంచడం, జట్ల మధ్య పోటీని మరింత తీవ్రం చేయడం, అభిమానులకు ఆసక్తికరమైన టోర్నీ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఐసీసీ పేర్కొంది.
2027 వన్డే ప్రపంచకప్.. మూడు దశల్లో సమరం
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. అయితే టోర్నీ మూడు దశల్లో సాగనుంది. అర్హత సాధించిన 14 జట్లలో దిగువ మూడు స్థానాల్లో ఉన్న జట్లు తొలి దశలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ‘సూపర్ సిరీస్’ ఆడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు తదుపరి దశకు చేరుతుంది.
ఇక రెండో దశలో.. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. మొత్తం 30 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి గ్రూపు నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్-7’ దశకు చేరతాయి.
సూపర్-7లో అసలు సమరం
మూడో దశలో ఏడు జట్లు ‘సూపర్-7’లో రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. ఈ దశలో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో తొలి సెమీఫైనల్ ఆడుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. 2023లో భారత్ వేదికగా జరిగిన గత వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
2028 టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్-10’

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్న 2028 పురుషుల టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. అయితే గ్రూపుల విధానాన్ని పూర్తిగా మార్చారు. 2026 టోర్నీలో నాలుగు గ్రూపుల్లో ఐదేసి జట్లు ఉండగా.. 2028లో 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూపు దశలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్-10’ దశకు చేరతాయి.
కొత్తగా ఎలిమినేటర్ మ్యాచ్‌లు
సూపర్-10 దశలో పది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. మొత్తం 20 మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరతాయి.
మిగిలిన రెండు సెమీఫైనల్ స్థానాల కోసం కొత్తగా ‘ఎలిమినేటర్’ పోరును ప్రవేశపెట్టారు. ఒక గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన జట్టు మరో గ్రూపులో మూడో స్థానంలోని జట్టుతో తలపడుతుంది. అదే విధంగా రెండో గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి గ్రూపులో మూడో స్థానంలోని జట్టుతో పోటీ పడుతుంది. ఈ రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌ల విజేతలు సెమీఫైనల్స్‌కు చేరతారు. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ ప్రస్తుతం ఉన్న విధానంలోనే జరుగుతాయి.
భారత్ సహా 12 జట్లకు నేరుగా బెర్త్

2028 టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటికే 12 జట్లు అర్హత సాధించాయి. 2026 టీ20 ప్రపంచకప్ ప్రదర్శన, జట్ల ర్యాంకింగ్స్ ఆధారంగా అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి.
మిగిలిన ఎనిమిది స్థానాలను 16 జట్లతో నిర్వహించే ప్రపంచ అర్హత టోర్నీ ద్వారా భర్తీ చేయనున్నారు. 2026 ప్రపంచకప్‌లో ఆడి నేరుగా అర్హత సాధించలేకపోయిన కెనడా, ఇటలీ, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా జట్లు నేరుగా ఈ అర్హత టోర్నీలో పాల్గొంటాయి.
ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో స్కాట్లాండ్‌కు ప్రపంచ అర్హత టోర్నీలో నేరుగా అవకాశం ఇవ్వకుండా యూరప్ ప్రాంతీయ ఫైనల్‌లో ప్రవేశం కల్పించనున్నారు. మిగిలిన ఎనిమిది స్థానాలు ఆఫ్రికా నుంచి రెండు, ఆసియా నుంచి రెండు, యూరప్ నుంచి రెండు, అమెరికాస్ నుంచి ఒకటి, తూర్పు ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి ఒక జట్టుతో భర్తీ కానున్నాయి.
ప్రపంచకప్ పోరు ఇక మరింత హోరాహోరీ
కొత్త విధానాలతో ప్రపంచకప్‌లలో ప్రతి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం పెరగనుంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌లో ‘సూపర్-7’, 2028 టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్-10’, ఎలిమినేటర్ పోటీలు అభిమానులకు అదనపు ఉత్కంఠను అందించనున్నాయి. వర్ధమాన జట్లకు పెద్ద జట్లతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తూ, ప్రపంచ క్రికెట్‌లో పోటీ స్థాయిని మరింత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ఐసీసీ వెల్లడించింది.
