తెలంగాణ గర్వించదగ్గ మైలురాయి..

  • మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు ప్రతిష్టాత్మక ‘NABH’ గుర్తింపు…..
  • నాణ్యమైన వైద్య సేవలకు నిదర్శనంగా నిలిచిన ఘన్‌పూర్ మెడిసిటి…
  • రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన అతికొద్ది టీచింగ్ హాస్పిటల్స్ లో ఒకటిగా గుర్తింపు
  • విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సంస్థ యాజమాన్యం

మేడ్చల్, ఆంధ్రప్రభ : వైద్య సేవల రంగంలో నాణ్యతా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచే ప్రతిష్టాత్మక NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) గుర్తింపును మేడ్చల్ జిల్లా ఘన్‌పూర్ లోని మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సొంతం చేసుకుంది. తెలంగాణలోని మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్ లో ఈ అరుదైన గుర్తింపు సాధించిన అతి కొద్ది సంస్థలలో ఒకటిగా మెడిసిటి హాస్పిటల్ నిలిచింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల ప్రత్యేక సమావేశంలో సంస్థ యాజమాన్యం వివరాలను వెల్లడించింది.

ఈ సమావేశంలో మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ శ్రీ ఐనిష్ మర్చంట్ మాట్లాడుతూ… వైద్య సేవల్లో నాణ్యత అనేది ఒక రోజుతో ముగిసేది కాదని, అది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ అందిస్తున్న నాణ్యమైన సేవలకు, సిబ్బంది పట్టుదలకు ఈ NABH అక్రిడేషన్ నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ మాట్లాడుతూ… 1980 నాటి నుండి మెడిసిటి ఎన్నో అరుదైన ఘనతలను సాధించిందని గుర్తుచేశారు. ​

1990ల ప్రాంతంలో అమెరికాలో పనిచేస్తున్న వైద్యులు లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను స్థాపించారు. 1993లోనే హైదరాబాద్ నగరంలో గుండెకు బైపాస్ శస్త్రచికిత్సలు, స్టెంట్ వేసే అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చిన ఘనత మెడిసిటిది అని ఆయన వివరించారు. NABH బృందం హాస్పిటల్ లోని అన్ని విభాగాలను, నాణ్యతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఈ గుర్తింపు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ అక్రిడేషన్ శాశ్వతం కాదని, ప్రతి రెండు-మూడేళ్లకు ఒకసారి తిరిగి తనిఖీలు ఉంటాయని… కాబట్టి నాణ్యతను నిరంతరం కాపాడుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ ప్రక్రియ ద్వారా సిబ్బందిలో బాధ్యత పెరిగి, రోగులకు లోపాలు లేని వైద్యం అందుతుందని, భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు తీసుకువస్తామని ప్రకటించారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ శ్రీ ఐనిష్ మర్చంట్, మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి తదితరులు పాల్గొని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.