Chittoor | మల్లప్ప కొండపై తమిళనాడు వాసి దారుణహత్య…

దర్శనం ముగించుకుని వస్తుండగా కిరాతకం..
భార్య, బిడ్డ అదృశ్యం..
వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు


Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లప్ప కొండపై తమిళనాడుకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టించింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సూలగిరికి చెందిన రమేష్ అనే యువకుడు తన భార్య, చిన్నారితో కలిసి శ్రీ మల్లేశ్వరస్వామి దర్శనానికి వచ్చి, తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, రమేష్ రెండేళ్ల క్రితం శాంతిపురం మండలం బోయినపల్లికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంగళవారం అమావాస్య సందర్భంగా భార్య, బిడ్డను చూసేందుకు అత్తారింటికి వచ్చిన రమేష్, అక్కడి నుంచి వారితో కలిసి ద్విచక్ర వాహనంపై మల్లప్ప కొండకు శ్రీ మల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా మల్లప్ప కొండ మూడవ మలుపు వద్ద ఆయనపై దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన అంశం మృతుడి భార్య, చిన్నారి అదృశ్యం కావడమే. ప్రాథమిక విచారణలో రమేష్, భార్య, బిడ్డ కలిసి వచ్చిన ద్విచక్ర వాహనంపైనే మరో ఇద్దరు యువకులతో కలిసి మృతుడి భార్య అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హత్య వెనుక ఆమె పాత్ర ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

అయితే ఈ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తలెత్తింది. మృతుడి భార్య, చిన్నారిని ఆ వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారా? లేక ఆమె స్వచ్ఛందంగానే వారితో వెళ్లిందా? అనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భార్య, చిన్నారి ఆచూకీ లభిస్తే కేసులోని అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి భార్యకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉండటం వల్లే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు.

ఘటన సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలు, సెల్‌ఫోన్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి మృతుడి భార్య, చిన్నారి, అలాగే అనుమానితుల కోసం ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే మల్లప్ప కొండలో అమావాస్య రోజున భక్తుల రద్దీ మధ్య జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ మిస్టరీ కేసును ఛేదించేందుకు కుప్పం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.