పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ మల్లారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్రాజ్యం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.రెహమాన్ మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీల్లో కార్మికులు తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రజల శ్రేయస్సు, గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు ఇప్పటివరకు ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పనివేళలు అమలు చేయడంతో పాటు వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, జాతీయ సెలవులు, అర్జిత సెలవులు కల్పించాలని కోరారు. ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే లైసెన్సులు ఇప్పించాలని, ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు.

ప్రతి సంవత్సరం మూడు జతల యూనిఫాంలు, చెప్పులు, సబ్బులు, నూనె, బెల్లం అందించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా, సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందించాలని కోరారు. జీవో నెంబర్ 51ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు శివశంకర్, పెంటయ్య, యేసయ్య, కృష్ణ, పద్మారావు, మేఘరాజ్, గణేష్, భాగయ్య, దుర్గయ్య, సంజీవులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply