రేషన్ పంపిణీలో రాజీ లేదు..

రేషన్ పంపిణీలో రాజీ లేదు..
నాణ్యమైన సరుకులు సమయానికి అందాలి: కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి కార్డుదారునికి నాణ్యమైన రేషన్ సరుకులు సమయానికి అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అక్రమాలు, అదనపు వసూళ్లు, డైవర్షన్‌కు తావులేకుండా కఠిన నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో రేషన్ బియ్యం పంపిణీ, ఈ-పోస్ యంత్రాల పనితీరు, ఎఫ్‌పీ షాపుల నిర్వహణ, రేషన్ సరుకుల అక్రమ రవాణా నివారణ, అర్హులందరికీ సరుకుల పంపిణీ, దీపం పథకం అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్డుదారునికి సమయానికి నాణ్యమైన సరుకులు అందించడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు. రేషన్ సరుకుల నాణ్యత, పంపిణీ సమయపాలన, అదనపు వసూళ్లపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 10 లేదా 12వ తేదీలోపు రేషన్ పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎఫ్‌పీ షాపుల్లో రోజువారీ పంపిణీ, నిల్వలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 25వ తేదీ నుంచి ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌పీ షాపులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినా సరఫరా ఆగకుండా సమీప షాపులకు బాధ్యతలు అప్పగిస్తూ పంపిణీ కొనసాగిస్తున్నట్లు వివరించారు.
దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లపై కొందరు డీలర్లు అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఆదోని డివిజన్‌లో ఎక్కువ ఫిర్యాదులు నమోదవుతున్నాయని పేర్కొంటూ, ఇప్పటివరకు 14 మంది డెలివరీ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ అర్హులకు రేషన్ పూర్తిగా అందేలా చూడడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. గత ఆరు నెలల్లో పెద్దఎత్తున కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెక్‌పోస్టులు, రైస్ మిల్లులు, గోదాములు, రవాణా మార్గాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
