కన్నెర్ర చేసిన కర్షకులు

కన్నెర్ర చేసిన కర్షకులు
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్
జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
లారీలు రాక నిలిచిపోయిన ధాన్యం తరలింపు
ఆగ్రహంతో రహదారిపైనే ధాన్యం తగలబెట్టిన రైతులు
గుమ్మడిదల, మే 27. ఆంధ్ర ప్రభ : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదల మండల రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. గుమ్మడిదల రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయినా లారీలు అందుబాటులో లేకపోవడంతో తరలింపు పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిముద్ద కావడంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపారు.

వర్షానికి తడిసిన ధాన్యం
కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు పేర్కొన్నారు. తార్పాలిన్లు, గోదాముల సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీటిలో ధాన్యం తడిసిపోయిందని ఆరోపించారు. ఇప్పటికే పెట్టుబడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ పరిస్థితి మరింత భారంగా మారిందన్నారు.
రహదారిపై బైఠాయింపు
తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతులు తడిసిన ధాన్యంతోనే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ధాన్యం తగలబెట్టి నిరసన
ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు రైతులు ఆగ్రహంతో రహదారిపైనే తడిసిన ధాన్యాన్ని తగలబెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను శాంతింపజేయడానికి పోలీసులు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు.
అధికారుల హామీ
సమాచారం అందుకున్న రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించే చర్యలు చేపడతామని, తడిసిన ధాన్యం కొనుగోలు అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.
