ముఖరా (కే)లో పండిన జపాన్ మియాజాకి మామిడి..

  • రైతులకు ఉద్యానశాఖ అభినందనలు

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఉద్యానవన శాఖ అధికారులు క్రాంతికుమార్, ఉద్యానవన శాఖ ఎస్‌హెచ్‌వో శేఖర్ శనివారం ఇచ్చోడ మండలంలోని ముఖరా (కే) గ్రామంలో పర్యటించి జపాన్‌కు చెందిన అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి పంటను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరుగాంచిన మియాజాకి మామిడి ముఖరా (కే) గ్రామంలో పండడం విశేషమన్నారు. జిల్లాలోనే మియాజాకి మామిడి మొక్కలను నాటి, విజయవంతంగా పండించిన తొలి గ్రామంగా ముఖరా (కే) నిలిచిందని తెలిపారు.

నాలుగేళ్ల క్రితం మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి వ్యవసాయ క్షేత్రంలో నాటిన మియాజాకి మొక్కలు ప్రస్తుతం ఫలాలు ఇవ్వడం సంతోషకరమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి పండ్లకు కిలోకు రూ.2 లక్షల వరకు ధర లభిస్తోందని తెలిపారు.

రైతులు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త ఆలోచనలతో అధిక విలువ కలిగిన పంటలను సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చని సూచించారు. నేడు మియాజాకి పండ్లు రైతులకు లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు.

వినూత్న సాగు విధానాన్ని అవలంబించి మియాజాకి మామిడి పండించిన రైతులు గాడ్గే మీనాక్షి, సుభాష్‌లను ఆదిలాబాద్ ఉద్యానవన శాఖ తరఫున అధికారులు అభినందించారు.