సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం సంఘటిత పోరుబాట

అమిత్ షా హామీ నిలబెట్టుకోవాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం

ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిచే వరకు విద్యార్థి, యువజన లోకం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సి. కాశీం పిలుపునిచ్చారు.

బుధవారం ఆదిలాబాద్ కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో సిమెంట్ పరిశ్రమ సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థి యువజన పోరుగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

సభలో ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను మూసివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

6 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో విలువైన సాగు భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.

పరిశ్రమలు లేక వేలాది మంది నిరుద్యోగులు, కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ కోసం రైతుల నుంచి 772 ఎకరాల భూమిని సేకరించారని, ఇప్పుడు ఆ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తూ ఆర్థిక సంస్కరణల పేరుతో కార్మికుల ఉపాధిపై దెబ్బకొడుతోందని ఆరోపించారు. పరిశ్రమను పునరుద్ధరించే వరకు రాజకీయాలకు అతీతంగా సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సీసీఐ తెరిపిస్తామన్న అమిత్ షా హామీ ఏమైంది?

2018 నుంచి పలుమార్లు ఎన్నికల సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపిస్తే తప్పకుండా సీసీఐని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దాన్ని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఇక్కడ 100 శాతం సున్నపురాయి ముడిసరుకు, విద్యుత్, నీటి లభ్యతతో పాటు జాతీయ రహదారి, రైల్వే లైన్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌పై చిన్నచూపు చూస్తోందని అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని రామన్న పిలుపునిచ్చారు. సీసీఐని పునరుద్ధరించేందుకు జరిగే పోరాటంలో ముందుండి, అవసరమైతే ఆమరణ దీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్, తెలంగాణ తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి సలాం వరుణ్, కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ, యూనిస్ అక్బానీ, దాసరి రమేష్, లోకారి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.