Tims Sanathnagar | రాష్ట్ర వైద్య వ్యవస్థపై టిమ్స్ ప్రభావం

Tims Sanathnagar | రాష్ట్ర వైద్య వ్యవస్థపై టిమ్స్ ప్రభావం

Tims Sanathnagar | సనత్‌నగర్ టిమ్స్ అకడమిక్ రూపాంతరం
స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీ ప్రత్యేకతలు
నిమ్స్, గాంధీ తరహా వైద్య సేవల దిశగా అడుగులు
అధునాతన అకడమిక్ బ్లాక్ మరియు రీసెర్చ్ సౌకర్యాలు
పీజీ సీట్లు, ఐసీయూ సామర్థ్యం మరియు ఆపరేషన్ థియేటర్లు
టీమ్స్ ప్రారంభ సన్నాహాలు మరియు ప్రభుత్వ ప్రణాళికలు

Tims Sanathnagar | హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్)ను కేవలం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గానే కాకుండా, స్టాండ్ అలోన్ మెడికల్ పీజీ కాలేజీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అటానమస్ హోదాతో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మాత్రమే ఈ పీజీ కోర్సులు అందిస్తుండగా, త్వరలోనే సనత్‌నగర్ టిమ్స్ కూడా స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీ జాబితాలో చేరనుంది.

సాధారణంగా ఒక మెడికల్ కాలేజీ అంటే ఎంబీబీఎస్ సీట్లతో మొదలై ఆ తర్వాత పీజీ కోర్సులు ప్రారంభమవుతాయి. కానీ ఈ స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీల్లో నేరుగా పీజీ (ఎండీ, ఎంఎస్), సూపర్ స్పెషాలిటీ (డీఎం, ఎంసీహెచ్) విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఈ సంస్థలకు సొంత యూనివర్సిటీ హోదా ఉంటుంది. ఇవి ఏ ఇతర వర్సిటీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా టైమ్ టేబుల్, పరీక్షలను నిర్వహించుకుంటాయి. దీనివల్ల టీచింగ్ ఫ్యాకల్టీ పూర్తిస్థాయిలో రీసెర్చ్, క్లిష్టమైన చికిత్సలపైనే దృష్టి సారించే అవకాశం ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రుల్లో సనత్‌నగర్ అకడమిక్ ఏర్పాటు భిన్నంగా ఉండనుంది. అల్వాల్‌లోని టిమ్స్ హాస్పిటల్‌ను కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, ఎల్బీనగర్ టిమ్స్‌ను మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఆయా మెడికల్ కాలేజీల విద్యార్థులకు బోధన ఆసుపత్రులుగా పని చేయనున్నాయి. అయితే సనత్‌నగర్ టిమ్స్ మాత్రం ఏ ఇతర కాలేజీపై ఆధారపడకుండా స్వతంత్రంగా తన అకడమిక్ హోదాను కలిగి ఉంటుంది.

ఇక్కడ ఎంబీబీఎస్ విద్యార్థుల తాకిడి లేకపోవడం వల్ల సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండి రోగులకు అత్యున్నత స్థాయి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. గాంధీ పీజీ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల నమూనాలో ఈ స్టాండ్ అలోన్ విధానం పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పీజీఐ చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ సంస్థల తరహాలో ఇది అభివృద్ధి చెందనుంది.


అధునాతన అకడమిక్ బ్లాక్

కేవలం ఆసుపత్రి భవనాలు మాత్రమే కాకుండా పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐదు అంతస్తుల అకాడమిక్ బ్లాక్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందులో 200 మంది కూర్చునే సామర్థ్యం గల లెక్చర్ హాల్‌తో పాటు అధునాతన ల్యాబ్‌లు, రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి. డాక్టర్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.

రోగుల సహాయకుల కోసం 196 జనరల్ పడకలు, 30 పెయిడ్ పడకలతో కూడిన ధర్మశాల భవనం నిర్మించారు. రోజుకు 8 వేల మందికి భోజన వసతి కల్పించగల అతిపెద్ద వంటశాల కూడా అందుబాటులోకి రానుంది. ఇవన్నీ ఒక స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూట్‌కు ఉండాల్సిన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు నిదర్శనం.

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం ఒక సంస్థలో పీజీ సీట్లు రావాలంటే పడకల సంఖ్య, రోగుల రద్దీ, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు ప్రామాణికంగా ఉండాలి. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో మొత్తం వెయ్యి బెడ్లు అందుబాటులో ఉండగా, అందులో 300 బెడ్లు కేవలం ఐసీయూ విభాగానికే కేటాయించారు. 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 8 మైనర్ ఓటీలు ఉన్నాయి.

ఈ భారీ సామర్థ్యం దృష్ట్యా ఇక్కడ సుమారు 100 నుంచి 150 వరకు పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ వంటి 29 కీలక సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఇక్కడ తయారవుతారు.


టీమ్స్ ప్రారంభానికి సన్నాహాలు

సనత్‌నగర్ టిమ్స్‌లో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్, క్యాన్సర్ రోగుల కోసం రేడియేషన్ ఆంకాలజీ, లీనాక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం టిమ్స్‌లో జూన్ 1 నుంచి ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది.

జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అన్ని సేవలను అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సమయం ఖరారైతే ఒకటి రెండు రోజుల్లోనే టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

సనత్‌నగర్ టిమ్స్ అందుబాటులోకి వస్తే నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన, విశ్వసనీయమైన, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply