ప్రభుత్వ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పాలడుగు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో చేరిన నూతన విద్యార్థులకు గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.నర్సరీ, ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు సాంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమం ప్రారంభంలో సరస్వతీ దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులకు విద్యారంభ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు విద్యలో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. చిన్నారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంతటి భగవంతు గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శైలజ, ప్రధానోపాధ్యాయులు యెరెడ్ల కమలాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటగిరి, రాములు, విజయ, ప్రశాంతి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.