సీఎం ఉర్కొండ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై తొలి వారంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలంలోని ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మంగళవారం ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, అత్యవసర సదుపాయాలపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం ఉర్కొండపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ప్రతిపాదిత హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, భద్రతా ప్రమాణాలు, కాన్వాయ్ రాకపోకలు, పోలీసు బందోబస్తు, అగ్నిమాపక, అంబులెన్స్ ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే ఉర్కొండలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ మండల స్థాయి అధికారుల కార్యాలయ సముదాయం, నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను కూడా పరిశీలించి, స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.