బుజిలాపురంలో పట్టపగలే చోరీ..
బుజిలాపురంలో పట్టపగలే చోరీ..
- ఐదున్నర తులాల బంగారం
- 33 తులాల వెండి,రూ.5 వేల నగదు దోచుకెళ్లిన దొంగలు
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలో గుర్తుతెలియని దుండగులు సోమవారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే చోరీకి పాల్పడి ఐదున్నర తులాల బంగారం,33 తులాల వెండి ఆభరణాలు, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. మోత్కూర్ నుండి నార్కట్ పల్లి కి వెళ్లే దారిలో బుజులాపురం స్టేజి వద్ద మలిపెద్ది వెంకట్ రెడ్డి, పద్మ దంపతులు గ్రామంలోకి వెళ్లే రోడ్డు పక్కన ఇంట్లో నివాసం ఉంటున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు వెంకట్ రెడ్డి తన వ్యవసాయ అవసరాల నిమిత్తం మోత్కూర్ కి వెళ్ళాడు . వెంకట్ రెడ్డి భార్య పద్మ గత 3 రోజుల క్రితమే ఊరికి వెళ్ళింది . వెంకట్ రెడ్డి తన ఇంటికి తాళం వేసి మోత్కూరు వెళ్లి తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండడంతో లబోదిబోమంటూ అరిచాడు.
దీంతో సమీపవాసులు అక్కడకి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సతీష్ కుమార్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బెడ్ రూమ్ లో ఉన్న 2 బీరువాలు పగులగొట్టి ఉండడంతో ఆయా బీరువాలో దాచిన నాలుగు తులాల చంద్రహారం, అర తులం బ్రాస్లెట్, అర తులం ఉంగరాలు, అర తులం కమ్మలు , 3 తులాల వెండి గొలుసు, 30 తులాల వెండి పట్టీలు( రెండు జతలు )తోపాటు రూ. 5000 నగదు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు.
గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి అనుమానితుల కదలికలపై దర్యాప్తు చేపట్టినట్లు సి ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సి ఐ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం చోరీ ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి పలు రకాల ఆధారాలు,శాంపిల్స్ సేకరించారు. బాధితుడు వెంకట్ రెడ్డి పిర్యాదు మేరకు సి ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెలలో రెండో చోరీ…తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
బుజిలాపురంలో పట్టపగలే చోరీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని , నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే గ్రామంలో గత నెల రోజుల లోపే దొంతి మచ్చగిరి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే చోరీకి పాల్పడి బీరువా పగులగొట్టి రూ.1 లక్ష 60 వేల నగదు దోచుకెళ్లారు.ఈ ఘటనలో బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ, కేవలం నగదు మాత్రమే దోచుకెళ్లారంటే ఇది స్థానికుల పనే అయి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వెంకట్ రెడ్డి ఇంట్లో చోరీ విషయంలో సైతం కేవలం 2 గంటల్లోనే మోత్కూర్ కి వెళ్లి వచ్చేసరికి పట్టపగలే చోరీకి పాల్పడ్డారంటే ఆ దొంగలు బాధితులను ఓ కంట కనిపెడుతూ చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల 2 రోజుల క్రితమే అనాజీపురం లో సైతం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి దొంగలు 12 తులాల వెండి,రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు.


