డీజిల్.. నో స్టాక్ !

డీజిల్.. నో స్టాక్ !
ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర కొరత
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
బంకుల యాజమాన్యాల తీరుపై ఆగ్రహం
బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు
అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటో?
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు వంటి ప్రాంతాలతో పాటు విజయవాడ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపిస్తుండగా, రికమండేషన్ ఉన్నవారికే పరిమితంగా ఇంధనం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ఆటో డ్రైవర్లు తమ వాహనాలు నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. ఇటు వ్యవసాయ పనులు కూడా జరుగుతున్న తరుణంలో డీజిల్ లభ్యత కొరవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
రికమండేషన్ ఉన్న వారికే..
ఎన్టీఆర్ జిల్లాలో యుద్ధ వాతావరణంలో డీజిల్ కొరత కొత్త మలుపు తీసుకుంది. పూర్తి ట్యాంక్ నింపడం లేదు, రికమండేషన్ ఉన్న వారికి మాత్రమే ‘హాఫ్ ట్యాంక్’ ఇస్తున్నారన్న ఆరోపణలు వినియోగదారుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కొంతవరకు సరఫరా కొనసాగుతుండగా, పట్టణంలో మాత్రం బంకులు డీజిల్ ఇవ్వకుండా తిరస్కరిస్తున్నాయి.
రోడ్లపై ఆటో డ్రైవర్ల నిరసన..
జగ్గయ్యపేటలో పరిస్థితి మరింత దిగజారింది. నాలుగు రోజులుగా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిరాయిలు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, ఇప్పుడు ఇంధనం లేక పూర్తిగా ఆదాయం కోల్పోయారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు నందిగామ తో పాటు మరికొన్ని మండలాల్లో కొన్ని బంకులు డీజిల్‌ను వినియోగదారులకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంభంపాడు గ్రామంలో ప్రత్యేక ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించారన్న సమాచారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
డీలర్లు ముందుగా నగదు చెల్లించలేక..
జిల్లాలో ప్రధానంగా ఇండియన్, భారత్, హెచ్‌పీ డీజిల్ బంకులు ఉన్నాయి. వీటితో పాటు నుమాయా, జియో వంటి వాటి ఇతర ప్రైవేట్ కంపెనీల బంకులు నడుస్తున్నాయి. అయితే యుద్ధం కారణంగా లీటర్ డీజిల్ పై 20 నుంచి 30 రూపాయలు అదనపు భారంగా ప్రభావం కనిపించడంతో ఇండియన్, భారత్, హెచ్‌పీ కంపెనీల పై పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి చెందిన ఆ కంపెనీలు డీజిల్ విక్రయాలను తగ్గించాలని బంకుల డీలర్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో డీజిల్ ట్యాంకర్ బంకులకు పంపిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో నగదు డీలర్లు చెల్లించేవారు.
అయితే ప్రస్తుతం అడ్వాన్స్ చెల్లించిన డీజిల్‌ను సరఫరా చేయమని కంపెనీలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న డీలర్లు ముందుగా నగదు చెల్లించలేక బంకు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వరి పంటతో పాటు, మొక్కజొన్న పంటలను హార్వెస్టర్లతో కోయిస్తున్నారు. ధాన్యం, మొక్కజొన్న పంటలను గ్రామాల్లో, మిషన్లతో కోయిస్తూ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం పనులు నిలిచిపోయే ప్రమాదముంది.
అసలు కారణం ఏంటి?..
పెట్రోలియం కంపెనీలు గతంలో డీలర్లకు అప్పుగా ఇంధనం సరఫరా చేసేవి. ప్రస్తుతం మాత్రం “క్యాష్ అండ్ క్యారీ” విధానం అమలు చేస్తున్నారు. పాత బకాయిలతో పాటు కొత్తగా నగదు చెల్లించి సరుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో డీలర్లు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడి, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా మారినట్లు తెలుస్తోంది. అయితే దీన్నే అవకాశంగా మార్చుకున్న కొంతమంది డీజిల్ సరఫరాను నియంత్రించడంతోపాటు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
కొన్ని ప్రాంతాలలో అధికారుల దృష్టికి కొంత మంది ఈ విషయాన్ని తీసుకువెళ్లగా మాట దాటవేయడంతోపాటు, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. డీజిల్ సరఫరా లోపాలపై తక్షణ విచారణ జరిపి, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
