Operation Kavach | ముమ్మరంగా వాహన తనిఖీలు

Operation Kavach | ముమ్మరంగా వాహన తనిఖీలు

‘ఆపరేషన్ కవచ్’
ప‌ర్య‌వేక్షించిన హైదరాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌
నెంబ‌ర్ ప్లేట్లు, ప‌త్రాలు లేని వాహ‌నాల‌ సీజ్‌
మొత్తం 2,149 వాహనాల స్వాధీనం

Operation Kavach | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ నంబర్లు, లేదా అసలు నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన కాదని, ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేసి విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఆప‌రేష‌న్ క‌వ‌చ్ పేరుతో పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వ‌హించింది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా గురువారం రాత్రి హైదరాబాద్ నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కవచ్’ పేరిట విస్తృత స్థాయి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ఆప‌రేష‌న్ క‌వ‌చ్‌లో భాగంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా చేపట్టారు. జూబ్లీహిల్స్–వెంకటగిరి, మధురానగర్–కృష్ణకాంత్ పార్క్, బోరబండ–పీలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్–సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.

ఈ తనిఖీలను స్వయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్‌ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. నగరంలో భద్రతా పరిస్థితులు, ట్రాఫిక్ నిబంధనల అమలు తీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. నగరంలో కొనసాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో 8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 ఫోర్ వీలర్స్, 1,623 ఆటోలు ఉన్నాయి.

తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించారు. అందులో 1,406 వాహనాలకు తప్పు నంబర్ ప్లేట్లు ఉండగా, 1,132 వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడిపినట్లు తేలింది. అలాగే 69 వాహనాలు నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం 2,149 వాహనాలను (2,046 ద్విచక్ర వాహనాలు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాహ‌నాల నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు. చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. నగర శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరింత కఠినంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.