మెడికల్ బోర్డు కోసం పోరాటమే..!

మెడికల్ బోర్డు కోసం పోరాటమే..!

  • ప్రభుత్వం, యాజమాన్యానికి నెల రోజుల గడువు
  • కార్మిక హక్కుల కోసం దీక్షకు టిఆర్ఎస్ సిద్ధం
  • 5ఇంక్లైన్ గేట్ మీటింగ్లో కల్వకుంట్ల కవిత

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : “గని గర్భంలో చెమట చిందించిన కార్మికుడి ఆరోగ్యమే సంపద… ఆ సంపదను కాపాడే మెడికల్ బోర్డులే లేకుంటే పోరాటమే మార్గం” అంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. భూపాలపల్లిలోని కాకతీయ ఖని-5 వద్ద శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల ఆరోగ్య పరీక్షల కోసం మెడికల్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, యాజమాన్యానికి నెల రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన, జూలై 20లోగా మెడికల్ బోర్డుల నిర్వహణపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించకపోతే అదే రోజు గాంధేయ మార్గంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

ప్రస్తుతం సుమారు 1,200 మంది కార్మికులు మెడికల్ బోర్డు పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారని, వారి ఆరోగ్య పరిస్థితులు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. నెలకు కనీసం రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 750 మంది ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించగా, తాము చేపట్టిన నిరాహార దీక్ష ఫలితంగానే 450 మందికి ఇళ్ల పట్టాలు అందాయని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కూడా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, మెడికల్ బోర్డుల నిర్వహణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కల్వకుంట్ల డిమాండ్ చేశారు. గేట్ మీటింగ్ అనంతరం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.