ప్రమోషన్లలో ఇన్-సర్వీస్ టీచర్లకు తీరని అన్యాయం!
ప్రమోషన్లలో ఇన్-సర్వీస్ టీచర్లకు తీరని అన్యాయం!
- డైట్ ప్రమోషన్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చౌడారపు రాంప్రసాద్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయుల ఏంఈవో,డైట్ లెక్చరర్ ల పదోన్నతుల ప్రక్రియ గత రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిందనీ,ప్రమోషన్లలో ఇన్-సర్వీస్ టీచర్లకు తీరని అన్యాయం జరుగుతుందని డైట్ ప్రమోషన్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చౌడారపు రాంప్రసాద్ శనివారం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా,రేపటి పౌరులను తీర్చిదిద్దే శిల్పులుగా కీర్తించబడే ఉపాధ్యాయ లోకం.. నేడు కెరీర్ ఎదుగుదల లేక తీవ్ర నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది.
పాఠశాలల పర్యవేక్షణలో అత్యంత కీలకమైన ఎంఈఓ,డిప్యూటీ ఈఓ,డీఈఓ మరియు డైట్ లెక్చరర్ పోస్టుల పదోన్నతులు గత ఇరవై ఏళ్లుగా పూర్తిగా స్తంభించిపోవడం తో పాఠశాల విద్యాశాఖ లో ఉపాధ్యాయులు నిరాశ కు గురవుతున్నారు.ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి స్వరాష్ట్రం వరకు పాలకులు మారినా,ఉపాధ్యాయుల తలరాతలు మాత్రం మారలేదు,సదా సరికదా.. మరింత దిగజారాయి. ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి ఉపాధ్యాయులకు నేరుగా స్కూల్ అసిస్టెంట్‌గా రిక్రూట్ అయి, విద్యార్హతలు కలిగిన ఒక ఉపాధ్యాయుడికి సర్వీసులో కనీసం ఎంఈఓ,డైట్ లెక్చరర్,డిప్యూటీ ఈఓ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలూ ఉంటాయి.
కానీ, ఏకీకృత సర్వీస్ నిబంధనల లేమి కారణంగా గత ఇరవై ఏళ్లుగా ఈ ఆశలన్నీ అడుగంటాయి. విద్యాశాఖలో నెలకొన్న తీవ్ర వైరుధ్యం ఏమిటంటే.. కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన నాన్-టీచింగ్ సిబ్బంది ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రమంగా ప్రమోషన్లు పొందుతూ ఏకంగా జిల్లా విద్యాధికారి కుర్చీలో కూర్చుంటున్నారు.కానీ, ఉన్నత విద్యార్హతలతో నియామకమై దశాబ్దాల తరబడి తరగతి గదుల్లో సుద్దముక్క పట్టి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు మాత్రం రిటైర్మెంట్ వరకు ఒకే పోస్టుకు పరిమితం కావడం విద్యాశాఖలోని వివక్షకు నిలువెత్తు సాక్ష్యం…
జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కీలకమైన ప్రిన్సిపాల్ లెక్చరర్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా దర్శనమిస్తుండటంతో, కాబోయే ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందడం లేదు. కేవలం ఉపాధ్యాయ శిక్షణ కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎస్ సిఈఆర్ టి లో జరిగే కార్యక్రమాలు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ శిక్షణ,ఆక్షన్ రీసర్చ్,ప్రీ సర్వీస్ ఉపాధ్యాయ శిక్షణ, జనాభా విద్య,జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టిక్స్,ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విభాగాలు జిల్లా స్థాయిలో డైట్ లలో లేకపోవడంతో డైట్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో వందలాది ఎంఈఓ,డిప్యూటీ ఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలలపై పర్యవేక్షణ అదనపు భారం గెజిటెడ్ హెడ్మాస్టర్ ల పై పడింది.రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ కష్టం అవుతుంది.గత వారం రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన రెండు నోటిఫికేషన్లు ఉపాధ్యాయుల పదోన్నతి ఆశలు ఆవిరి అయ్యాయి.డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్,డైట్ సీనియర్ లెక్చరర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ కావడం ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
న్యాయంగా, సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ద్వారా దక్కాల్సిన పోస్టుల డైరెక్ట్ కోటా కింద భర్తీ చేయడం వల్ల ఈ నిర్ణయం సర్వీసులో ఉండి దశాబ్దాలుగా ప్రమోషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంది.తాజా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా రేపు డిప్యూటీ ఈఓలుగా,డైట్ లెక్చరర్లుగా రాబోయే వారిలో.. ఈ సీనియర్ ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పాఠాలు చెప్పి తీర్చిదిద్దిన వారి సొంత శిష్యులే ఉంటారు. అక్షరాలు నేర్పిన గురువులు..తాము పెంచి పెద్ద చేసిన శిష్యుల కింద సబార్డినేట్లుగా చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి ముంచుకొస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తుండటంతో ఉపాధ్యాయ లోకం ఆయన వైపే ఆశగా చూస్తోంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, ఈ నోటిఫికేషన్ల వల్ల ఇన్-సర్వీస్ టీచర్లకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి, గురువుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ విద్యావ్యవస్థ బలోపేతం చేయాలి. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తేవాలని నిరంతరం ఆకాంక్షించే సీఎం.. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రతిష్ఠంభనకు తక్షణమే చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. సీఎం సత్వరం చొరవ తీసుకొని, గతంలో ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ఎస్ జిటి లకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇచ్చినట్లు గానే చట్టపరమైన అడ్డంకులను తొలగించి ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించాలని ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తుంది. అని డైట్ ప్రమోషన్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు
చౌడారపు రాంప్రసాద్ డిమాండ్ చేశారు.
