కేసముద్రంలో చమురు సెగ

కేసముద్రంలో చమురు సెగ
- కృత్రిమ కొరత.. అక్రమార్కుల పంట
- బంకుల్లో ‘నో స్టాక్’.. పల్లెల్లో ‘బ్లాక్’ దందా
- సామాన్యుడిపై చమురు భారం: లీటర్ రూ. 150
- రైతులు డీజిల్ కోసం క్యాన్ల బారులు
- అధికారుల నిర్లక్ష్యం.. ఆగని అక్రమ విక్రయాలు
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత ఇటు రైతులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న కొందరు అక్రమ వ్యాపారులు గ్రామాల్లో బ్లాక్ మార్కెట్ దందాను ప్రారంభించారు. పల్లెల్లో లీటర్ పెట్రోల్‌ను రూ.150కు పైగా విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు.
బంకులో వాహనదారులు… రైతుల ఇబ్బందులు
లీటరుకు రూ. 150 ల చొప్పున విక్రయాలు

కేసముద్రం మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో, పోలీస్ స్టేషన్ సమీపంలోని మరో పెట్రోల్ బంక్, అదేవిధంగా కోరుకొండ పల్లి శివారులోని నెక్కొండ రోడ్డులోని మరో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లేక ఓ వైపు, డీజిల్ లేక మరోవైపు సామాన్య ప్రజలతో పాటు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉప్పరపల్లి రోడ్డులోనీ బంక్ లో డీజిల్ మధ్యాహ్నం ట్యాంకర్ వస్తుందని తెలియడంతో ఉదయం నుంచి రైతులు తమ క్యాన్లను క్యూ లైన్ లో పెట్టుకుని డీజిల్ కోసం కళ్ళు కాయలుకచేల ఎదురు చూస్తున్నారు.

అదేవిదంగా వ్యవసాయ మార్కెట్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ సమీపంలోని మరో పెట్రోల్ బంక్, కోరుకొండ పల్లి శివారులోని నెక్కొండ రోడ్డులోని మరో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఆలస్యంగా రావడంతో వాహనదారులు ఒక్కసారి ఎగబడ్డారు. దీంతో బంకు నిర్వాహకులు కట్టడి చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. పల్లెటూర్లో కిరాణా దుకాణాల్లో అమ్ముకునేందుకు 10నుంచి 20 లీటర్ల పెట్రోల్ ను క్యాన్లతో ద్వారా తీసుకొని వెళ్ళారు.
బంక్ లో పెట్రోల్ దొరకని కారణంగా ఇదే అదనుగా లీటరుకు రూ. 150 ల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకోవడం విశేషం. కాగా ఆయా బంక్ లో పెట్రోల్, డీజిల్ కోసం ఎర్రటి ఎండలో గంటల తరబడి వేచి ఉండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బంక్ నిర్వాహకులు మంచి నీటి వసతి, వాస్ రూముల ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు.
పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్”
పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించడంతో గత్యంతరం లేక వాహనదారులు అధిక ధరలకు పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
