నీట్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
- సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు
- పోలీస్ కమీషనరేట్ పరిధిలో 11 పరీక్ష కేంద్రాలు
- ర్యాలీ లు,ధర్నాలు నిషేధం.
- 3న జిరాక్స్ కేంద్రాలు మూత
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; నీట్ ప్రవేశ పరీక్ష సజావుగా సాఫీగా నిర్వహించేందుకు గాను పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిల 11 పరీక్ష కేంద్రాల్లో హన్మకొండ 4, వరంగల్ 2,కాజీపేట 3, జనగామలలో 2 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయన్నారు.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించ బడుతుందన్నారు.పరీక్ష నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఉండేందుకు గాను ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన్నట్లు తెలిపారు.నీట్ పరీక్ష ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని హెచ్చరించారు.
సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు పరీక్ష కేంద్రాల చోట నిషేధమని గుర్తు చేశారు. పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు ఈనెల 3న,ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. నీట్ పరీక్షల నిర్వహణకై ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు
ఉమ్మడి వరంగల్‌లో 14 కేంద్రాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో నీట్ ప్రవేశ పరీక్షను పకడ్బంధీగానే కాక పక్కాగా నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3 ఆదివారం రోజున నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 14 నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల్లో 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగనుంది.
అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్‌లోకి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నారకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తున్నారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
స్ట్రిక్ట్ రూల్స్..
అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, 4×6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని రావాలి. పేన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు.బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు తీసుకురాకూడదు.మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్‌లాంటివి గాకుండా సాధారణ దుస్తులు ధరించి రావాలి.పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్‌ను తీసుకురావచ్చు. డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు.ప్రతి గదిలో, మెయిన్ గేట్‌వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు.
