మత్తుపై యుద్ధం.. జిల్లాకు కొత్త లక్ష్యం

మత్తుపై యుద్ధం.. జిల్లాకు కొత్త లక్ష్యం
ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల మత్తుతో యువత విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని, జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్, నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమన్వయ సమావేశం శనివారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశంలో డ్రగ్స్‌పై దండయాత్ర, జిల్లాలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ-అడిక్షన్ కేంద్రాల సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్‌స్పాట్ల తనిఖీలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వినియోగించే వ్యక్తితో పాటు వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శారీరక, మానసిక, సామాజిక జీవితం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు రోగనిరోధక శక్తి తగ్గి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. మానసిక ఆందోళన, జ్ఞాపకశక్తి క్షీణత, ఏకాగ్రత లోపం వంటి సమస్యలతో పాటు కుటుంబ, ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.
జిల్లాలో గుర్తించిన సుమారు 150 హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. కీలక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. 1972 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థతో పాటు సమాజాన్ని దెబ్బతీసే మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. యువతలో అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమాలను ఉద్యమంలా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
హాట్‌స్పాట్ ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో నిఘా పెంచడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం. ఫణి దూర్జటి, డీఈవో చంద్రకళ, ఈగల్ అధికారులు ఎం. రవీంద్ర, సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా. కొల్లేటి రమేష్, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఎం. అనిల్ కుమార్, ఆకర్ష ఫౌండేషన్ సైకాలజిస్ట్ డా. శంకర్‌రావు, నవజీవన్ బాల్ భవన్ ప్రతినిధి శేఖర్‌బాబు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కో-ఆర్డినేటర్ ఆరవ రమేష్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
