CCI Adilabad | ఆదిలాబాద్ సీసీఐ కోసం బ‌య‌ల్దేరిన గులాబీ బృందం

కేటీఆర్ నేతృత్వంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ..
ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వినతి
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్న ప్రతినిధి బృందం

CCI Adilabad | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరింది. మూతపడిన సీసీఐ యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని బృందం కలవనుంది. కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసి, ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరనున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు వివరించనున్నారు. ఆదిలాబాద్ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీసీఐ పునరుద్ధరణ అంశంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేయనుంది. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.