Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో దిద్దుబాటు మొదలు
రంగంలోకి తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్
ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో వరుస సమావేశాలు
పార్టీ-ప్రభుత్వ సమన్వయం, సంస్థాగత బలోపేతం, అంతర్గత విభేదాల పరిష్కారంపై కసరత్తు
Congress | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు నేతల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు ప్రారంభించారు.
ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమైన మీనాక్షీ నటరాజన్.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం-పార్టీ మధ్య సమన్వయం, జిల్లాల వారీగా కాంగ్రెస్ పరిస్థితి, సంస్థాగత మార్పులు, కేడర్‌ను మరింత చైతన్యపరిచే వ్యూహాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
తన పర్యటనలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ‘వన్ టు వన్’ సమావేశాలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, సంస్థాగత బలహీనతలపై నేరుగా ఆరా తీసి, అవసరమైన సూచనలు చేయనున్నారు.
అలాగే ఈ నెల 17న రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న మీనాక్షీ నటరాజన్.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లే అంశంతో పాటు పార్టీ బలోపేతం, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ వరుస సమీక్షలు, ముఖాముఖి సమావేశాల ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తులను తగ్గించి, పార్టీ శ్రేణుల్లో సమన్వయాన్ని పెంపొందించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
