Nlgd | జామచెట్లబావి,కొండాపురం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

Nlgd | జామచెట్లబావి,కొండాపురం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా
- మున్సిపాలిటీ సుందరీకరణ లక్ష్యం
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
- రూ.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- రూ.1.75 కోట్ల బి టి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
- మరో అర కి.మీ మేర బి టి రోడ్డు కి హామీ
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్లబావి, కొండాపురం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు. సోమవారం ఆయన రూ.5 కోట్ల టీఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
జామచెట్లబావి–కొండాపురం మార్గంలో 1.5 కిలోమీటర్ల మేర రూ.1.75 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే పూనుకున్నారు. ఈ ప్రాంత సమస్యలు తనకు బాగా తెలుసని, ప్రజలు నమ్మకంతో గెలిపించారని, వారి సమస్యల పరిష్కారం తన లక్ష్యమని పేర్కొన్నారు.
మోత్కూర్ మెయిన్ రోడ్డును సుందరీకరణ చేసినట్లు గుర్తుచేసిన ఎమ్మెల్యే, మున్సిపాలిటీకి మరో రూ.15 కోట్లు మంజూరయ్యాయని, వాటితో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కొండాపురం గ్రామంలో 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి సూచించారు. జామచెట్లబావి వద్ద 5 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించి మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు.
అదనంగా, కొండాపురం నుంచి మరో 0.5 కి.మీ బీటీ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పబ్లిక్ హెల్త్ డీఈఈకి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కాశవాడలో స్థల సేకరణపై తహసీల్దార్‌కు సూచనలు ఇచ్చారు. గౌడ సంఘం విన్నపంపై 5 ఎకరాల భూమి పట్టా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తర్వాత పట్టణంలోని పలు సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, మల్లెబోయిన ప్రేమలత కొత్త ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
