ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు, మదర్ హాస్పిటల్స్ (హైదరాబాద్), చౌటుప్పల్ ‘ప్రశాంతి హాస్పిటల్’ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
వైద్య రంగంలో ఆమె కనబరుస్తున్న అద్భుత ప్రతిభకు గానూ “ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ IVF స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇయర్ – 2026” ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఘనంగా నిర్వహించిన ‘ప్రైడ్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ & సమ్మిట్–2026’ కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ ప్రశాంతి రెడ్డి ని శాలువాతో సత్కరించి, ఈ అవార్డును ప్రదానం చేశారు.
రెండు దశాబ్దాల నమ్మకం.. వేలాది కుటుంబాల్లో వెలుగులు
సంతానలేమితో బాధపడుతున్న వేలాది దంపతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను అందిస్తూ, అత్యధిక విజయాల రేటుతో ఎన్నో కుటుంబాల్లో సంతాన సాఫల్యత ఆనందాన్ని నింపినందుకు గానూ నిర్వాహకులు ఆమెను ఈ అత్యున్నత అవార్డుకు ఎంపిక చేశారు.
రెండు ప్రాంతాల్లో విస్తృత సేవలు
హైదరాబాద్ బోడుప్పల్‌లోని ‘మదర్ హాస్పిటల్స్ & IVF సెంటర్’ ద్వారా అత్యాధునిక ఫెర్టిలిటీ చికిత్సలను అందిస్తూనే, చౌటుప్పల్ పట్టణంలోని ‘ప్రశాంతి హాస్పిటల్’ ద్వారా కూడా ఆ ప్రాంత చుట్టుపక్కల ప్రజలకు, మహిళలకు ఎన్నో ఏళ్లుగా ఆమె అత్యుత్తమ గైనకాలజీ, ప్రసూతి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోగులకు సైతం కార్పొరేట్ స్థాయి నమ్మకమైన చికిత్సను అందించడంలో ఆమె ముందున్నారు.
వైద్య వర్గాలు, శ్రేయోభిలాషుల అభినందనలు
డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డి కి జాతీయ స్థాయి అవార్డు దక్కడం పట్ల అటు హైదరాబాద్ వైద్య వర్గాలతో పాటు ఇటు చౌటుప్పల్ పట్టణ ప్రజలు, ప్రశాంతి హాస్పిటల్ సిబ్బంది, సహచర వైద్యులు, రోగులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఆమె నిరంతర కృషికి, నిబద్ధతతో కూడిన వైద్య సేవలకు లభించిన నిజమైన గుర్తింపు అని కొనియాడారు. ఈ గౌరవం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో రోగులకు అండగా ఉంటామని హాస్పిటల్ ప్రతినిధులు పేర్కొన్నారు.
