నిజామాబాద్‌లో ఏసీబీ దాడులు..

నిజామాబాద్‌లో ఏసీబీ దాడులు..

  • ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

నిజామాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : అక్రమ ఆస్తులు కలిగిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిఘాను మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా అబ్కారీ శాఖలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లారెడ్డిపై ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, ఆయన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఏసీబీ అధికారులు సేకరిస్తున్న ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ నమోదు చేసిన కేసు ప్రకారం, మల్లారెడ్డి తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ మార్గాల్లో ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేశారు.

11 ప్రాంతాల్లో ఏకకాల దాడులు

జూన్ 23న ఉదయం నుంచి ఏసీబీ బృందాలు మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. ఈ దాడుల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం గుర్తించారు. అదనంగా ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులు వివిధ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యక్తుల పేర్లపై ఉన్నట్లు సమాచారం.

నగదు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్ల గుర్తింపు

సోదాల సమయంలో రూ.3.31 లక్షల నగదు, సుమారు రూ.50 లక్షల బ్యాంకు నిల్వలను అధికారులు గుర్తించారు. అలాగే మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లను గుర్తించారు. ఈ లాకర్లను త్వరలో తెరిచి అందులోని ఆస్తులను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

వాహనాల స్వాధీనం

దర్యాప్తులో భాగంగా ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్ విలువ ఆధారంగా ఈ ఆస్తుల అసలు విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని ఆస్తులపై దర్యాప్తు

ఇప్పటివరకు లభించిన ఆధారాలపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు, పెట్టుబడులు, బినామీ లావాదేవీల కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. నిందిత అధికారిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.