రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురవుతుంది: నిరంజన్ రెడ్డి

రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురవుతుంది: నిరంజన్ రెడ్డి

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ:

ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యమే కాకుండా రైతులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు.

బుధవారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం మనిగిల్లలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో యూరియా అందించకపోవడం, విద్యుత్ సరఫరాలో లోపాలు సృష్టించడం, ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులు దళారులకు ధాన్యం విక్రయించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, రవాణా సంస్థల వైఫల్యం కారణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షాలకు తడిసి నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో ధాన్యం వెంటనే కొనుగోలు చేసి, వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ధాన్యం విక్రయించేందుకు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.

రైతుల ఆవేదన ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందని హెచ్చరించారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, రైతు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు యాదవ్, కుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply