NEET Re-Exam | జాతీయ సగటును మించిన తెలంగాణ

  • రాష్ట్రంలో పరీక్షకు 73,059 మంది రిజిస్టర్…
  • హాజరైంది 65,087 మంది మాత్రమే..
  • గైర్హాజరైన 7,972 మంది…
  • తొలి పరీక్షతో పోలిస్తే 8.55 శాతం తగ్గుదల
  • టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో మొబైల్ దాచి పట్టుబడ్డ విద్యార్థి
  • జాతీయ సగటు కంటే మెరుగైన హాజరు కనబరిచిన తెలంగాణ
  • నిమిషం ఆలస్యంతో వెనుదిరిగిన పలువురు విద్యార్థులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పునఃపరీక్ష ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో నీట్ రీ-ఎగ్జామ్ కోసం మొత్తం 73,059 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 65,087 మందే పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాల రీత్యా 7,972 మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 89.09 శాతం హాజరు నమోదైంది.

గతంలో జరిగిన మొదటి పరీక్షలో రాష్ట్రంలో 97.64 శాతం హాజరు నమోదు కాగా, ఈసారి అది 8.55 శాతం తగ్గడం గమనార్హం. చాలా మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయడానికి ఆసక్తి చూపకపోవడం లేదా సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయారు. జాతీయ సగటు కంటే తెలంగాణ ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ కోసం 22,74,702 మంది కేటాయించబడగా, 19,95,527 మంది హాజరయ్యారు. జాతీయ స్థాయి సగటు హాజరు 87.7 శాతంగా ఉండగా, తెలంగాణలో 89.09 శాతంతో జాతీయ సగటు కంటే మెరుగైన హాజరును విద్యార్థులు కనబరిచారు.

హైదరాబాద్ టాప్.. సూర్యాపేట లాస్ట్…

రాష్ట్రవ్యాప్తంగా 208 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 91.54 శాతం హాజరు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాల్లో అత్యల్పంగా 84.03 శాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో గరిష్టంగా 27,954 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 24,973 (89.34శాతం) మంది పరీక్ష రాశారు. నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ వంటి జిల్లాల్లో కూడా 86 నుంచి 88 శాతం మధ్య హాజరు నమోదైంది.

బాత్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌తో దొరికిన అభ్యర్థి

పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ తనిఖీలు నిర్వహించినా, రంగారెడ్డి జిల్లాలో ఒక అభ్యర్థి వింత రీతిలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డాడు. జందావత్ నరేందర్ అనే విద్యార్థి ముందే పరీక్షా కేంద్రంలోని టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో మొబైల్ ఫోన్‌ను దాచి ఉంచాడు. పరీక్ష మధ్యలో టాయిలెట్‌కు వెళ్లి ఫోన్ ద్వారా సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. వెంటనే అతనిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.

నిమిషం ఆలస్యం.. కన్నీటి పర్యంతమైన పలువురు విద్యార్థులు

రాష్ట్రంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కీసరలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అత్యంత దయనీయ స్థితి కనిపించింది. ఒక విద్యార్థిని కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా కేంద్రానికి చేరుకుంది. గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపడం వల్ల తాము తప్పుగా వేరే దారిలోకి వెళ్లామని, తన కుమార్తె భవిష్యత్తు కోసం లోపలికి అనుమతించాలని ఆ తండ్రి అక్కడి పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.

నిబంధనల ప్రకారం గేట్లు మూసివేశామని చెప్పడంతో ఆ విద్యార్థిని అక్కడే కుప్పకూలిపోయింది. కూకట్‌పల్లి జేఎన్టీయూ వద్ద కూడా ఇద్దరు విద్యార్థినులు నిమిషం ఆలస్యంతో లోపలికి వెళ్లే అవకాశం కోల్పోయారు. పరీక్ష కేంద్రం చిరునామా విషయంలో గందరగోళానికి గురై ఓ విద్యార్థిని నీట్‌ పరీక్ష రాయలేకపోయింది.

కొడంగల్‌కు చెందిన ఝాన్సీప్రియ పరీక్ష కేంద్రం బాగ్‌లింగంపల్లిలో కేటాయించారు. ఝాన్సీప్రియ తొలుత బాగ్‌లింగంపల్లి బదులు శేరిలింగంపల్లికి వెళ్లింది. పొరపాటును గ్రహించి బాగ్‌లింగంపల్లికి చేరుకునేలోపు నీట్‌ పరీక్ష గడువు ముగిసింది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో నిరాశతో ఆమె వెనుదిరిగింది. మరోవైపు కోఠిలోని నీట్‌ పరీక్ష కేంద్రానికి నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.