State Governor | మాదకద్రవ్యాల నియంత్రణకు ఉద్యమంలా ‘నషా ముక్త్ భారత్’ …!

State Governor | మాదకద్రవ్యాల నియంత్రణకు ఉద్యమంలా ‘నషా ముక్త్ భారత్’ …!

  • క్షయ వ్యాధిగ్రస్తులను అధికారులు దత్తత తీసుకోండి ..!
  • రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

State Governor | ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్ : యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిర్మూలనకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్.పి. నితికా పంత్ లతో కలిసి వందేమాతర గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన అనంతరం గిరిజనుల ఆరోగ్యం, పేద వర్గాలకు అందించే పౌష్టిక ఆహారం, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన అంశాలపై గవర్నర్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా కొమురం భీం జిల్లాలో 464 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి జిల్లా అధికారులు ఒక్కొక్కరూ దత్తత తీసుకొని, నెలకు సరిపడా మందులు, సమతుల్య పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. చాలామంది రోజు దగ్గు, బరువు తగ్గుదల, ఆరోగ్య క్షీణత పై బయటకు చెప్పకుండా లో లోపల మదన పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

బయటకు చెబితే సమాజం చిన్న చూపు చూస్తారని భయం ఇప్పటికీ నెలకొందన్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఆధునిక చికిత్స తో క్షయ వ్యాధి నయం అవుతుందని, వైద్య సేవలపై అవగాహన పెంపొందించాలని గవర్నర్ అన్నారు. యువత మాదకద్రవ్యాలకు, మత్తుకు బానికై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నషా ముక్త్ భారత్ వైపు అడుగులు వేయాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలలో స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని గవర్నర్ అన్నారు.

  • అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఆవశ్యం..
    అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. సమాజంలో జరిగే అరాచకాలపై మౌనంగా ఉండొద్దని, ప్రజా వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వెనుకబడిన ఆదివాసి జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేలా అధికారులు కృషి చేయాలన్నారు.
  • కొమరం భీం జిల్లా అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
    కొమురం భీం జిల్లాలో ఆయా శాఖల వారీగా చేపడుతున్న సేవలు, సంక్షేమ అభివృద్ధి పనులపై గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ హరిత వివరించారు. సంక్షేమ అభివృద్ధి రంగాల్లో కార్యచరణ ప్రణాళిక గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్.పి. నితికా పంత్ జిల్లాలో శాంతి భద్రతల అంశాలను వివరిస్తూ, మాదకద్రవ్యాల నియంత్రణ పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
  • రాష్ట్ర గవర్నర్కు ఘనంగా స్వాగతం
    అంతకుముందు హెలికాప్టర్ ద్వారా ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా పర్యటనకు తొలిసారిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ కు ఘనమైన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్, ఎస్.పి., జిల్లా అధికారులు స్వాగతం పలికిన అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న కలెక్టర్ కు ధృవపత్రం ప్రదానం చేశారు. రాష్ట్ర గవర్నర్, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి లకు జిల్లా అధికారులు జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, అదనపు ఎస్.పి. (అడ్మిన్) చిత్తరంజన్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply