తాగునీటి కోసం తంటాలు.. కరువు ఛాయల్లో ముంబై

  • రిచ్చెస్ట్ సిటీకి నీటి కష్టాలు..
  • ముంబైలో తీవ్ర జల సంక్షోభం
  • దాహంతో అల్లాడుతున్న ఆర్థిక రాజధాని
  • జలాశయాలు ఖాళీ.. ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని, రిచ్చెస్ట్ సిటీ, అత్యధిక జనాభా కలిగిన నగరం ముంబై ప్రస్తుతం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు, మరోవైపు తాగునీటి కొరతతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా సముద్ర తీరానికి ప్రసిద్ధి చెందిన ముంబైలో ఈ స్థాయిలో నీటి సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరానికి నీరు అందించే ప్రధాన జలాశయాలు అడుగంటిపోతుండగా, మరోవైపు మెరైన్ డ్రైవ్ తీర ప్రాంతాల్లో సముద్రం అసాధారణంగా వెనక్కి వెళ్లి సముద్ర గర్భం (సీ బెడ్) బయటపడుతున్న దృశ్యాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

సముద్రం పక్కనే ఉన్న ముంబై మహానగరానికి తాగునీటి కోసం ఇంతటి సంక్షోభం రావడం విచిత్రంగా కనిపించినా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. తాగునీటి కోసం ముంబై పూర్తిగా జలాశయాలపైనే ఆధారపడుతోంది. ఆలస్యమైన మాన్సూన్, ఎల్‌నినో ప్రభావం, తగ్గిన వర్షపాతం కారణంగా జలాశయాలు నిండలేదు. దాంతో నగరం కరువు కాటుకు గురవుతోంది. ఒకప్పుడు వరదలతో వార్తల్లో నిలిచిన ముంబై.. ఇప్పుడు నీటి చుక్క ఎదురు చూస్తుంది.

సాధారణంగా జూన్ నాటికి నైరుతి రుతుపవనాలు జోరుగా క‌దిలి.. వ‌ర్షాలు కురవాల్సి ఉండగా, ఈసారి ఆలస్యమైన మాన్సూన్, ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముంబైకి తాగునీరు అందించే ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి అని తాజా రిపోర్ట్స్ చేబుతున్నాయి. దీంతో అధికారులు అత్యవసర చర్యలకు దిగారు.

ముంబై నగరానికి విహార్ లేక్, తులసీ లేక్, మోదక్ సాగర్, తన్సా, భత్సా, మిడిల్ వైతర్ణా, అప్పర్ వైతర్ణా అనే ఏడు ప్రధాన జలాశయాల నుంచి నీటి సరఫరా జరుగుతుంది. నగర శివార్లలో ఉన్న ఈ జలాశయాల నుంచి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రతిరోజూ దాదాపు 3,950 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. అయితే తాజా లెక్కల ప్రకారం ఈ ఏడు జలాశయాల్లో కలిపి కేవలం 10 శాతం నీరు మాత్రమే మిగిలి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, పెరుగుతున్న జనాభా అవసరాలు కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. భూగర్భ జలాల మట్టాలు కూడా భారీగా పడిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కష్టంగా మారాయి.

ఆలస్యమైన మాన్సూన్‌.. ఎల్‌నినో ఈ పరిస్థితికి ప్రధాన కారణమ‌ని అధికారులు పేర్కొంటున్నారు. గత పదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో దాదాపు 75 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఫలితంగా జలాశయాలు ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో నగరంపై కరువు ఛాయలు కమ్ముకున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఈ మేర‌కు బీఎంసీ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేసింది. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాణిజ్య సముదాయాలకు 20 శాతం మేర నీటి కోత విధిస్తోంది. అలాగే సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు, నేవీ వంటి ప్రభుత్వ సంస్థలు శుద్ధి చేసిన రీసైకిల్ నీటినే వినియోగించాలని సూచించింది. అలాగే, బైక్-కార్ వాష్ సెంటర్లను మూసివేయడం, అపార్ట్‌మెంట్లకు పరిమితంగా నీటి సరఫరా చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. అవసరమైన మేరకే నీటిని వినియోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

అయితే ప్రజల ఇబ్బందులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు నీటి కొరత.. మరోవైపు భగ్గుమంటున్న ఎండలు, ఉక్కపోతతో ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతతో చెమటలు కక్కుతున్న వేళ, స్నానం చేయాలన్నా, రోజువారీ అవసరాలకు నీరు వాడాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. సముద్ర తీరాన ఉన్న మహానగరమే తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి రావడం వాతావరణ మార్పుల తీవ్రతకు నిదర్శనంగా మారింది. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక రాజధాని అయినా.. కరువు కాటుకు అతీతం కాదని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జలాశయాల పరిరక్షణ వంటి చర్యలు వేగంగా చేపట్టకపోతే భవిష్యత్తులో దేశంలోని ఇతర మహానగరాలు కూడా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంద‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.