బహిరంగ సభలో ప్రధాని మోదీ ధీమా

బహిరంగ సభలో ప్రధాని మోదీ ధీమా
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోందని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారని, అదే కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు బీజేపీకి అవకాశమే లేదని భావించారని, కానీ అక్కడ పార్టీ బలంగా ఎదిగిందని గుర్తు చేశారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, వామపక్ష పార్టీల రాజకీయాలను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట్ల అవినీతి పెరిగిందని ఆరోపించారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నియంతృత్వ ధోరణిని అక్కడి ప్రజలే ఎదిరించారని అన్నారు.
ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో బీజేపీని అంటరాని పార్టీగా చూసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మోదీ తెలిపారు. తెలంగాణ యువతలో బీజేపీపై అపారమైన ప్రేమ కనిపిస్తోందని పేర్కొన్నారు.
కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాల కంటే విశ్వాస రాజకీయాలను ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
