Pune Murder Case | బిజినెస్‌మ్యాన్ మృతిలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి కాబోయే భార్యే!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ఇరు కుటుంబాలు వివాహ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంతలో కాబోయే భార్య పుట్టినరోజు కావడంతో ఆమెకు మరపురాని సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించిన యువకుడు ప్రత్యేకంగా ఓ ట్రిప్ ప్లాన్ చేశాడు. జీవితాంతం తోడుగా ఉంటుందని నమ్మిన ఆమెతో కలిసి కొండపైకి వెళ్లాడు. అయితే ఆనందంగా మొదలైన ఆ ప్రయాణం విషాదంగా ముగిసింది. ఫొటోలు దిగుతుండగా కాలు జారి లోయలో పడిపోయి మృతిచెందాడని యువతి చెప్పడంతో అంతా ప్రమాదంగానే భావించారు.

కానీ పోలీసుల దర్యాప్తులో బయటపడిన నిజాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అది ప్రమాదం కాదని, ముందే పథకం ప్రకారం అమలు చేసిన హత్య అని తేలింది. మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. తనను పెళ్లి చేసుకోబోతున్న యువతే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని విచారణలో వెలుగులోకి రావడం. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు పూణె గహుంజేకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్ వ్యాపారవేత్తకు కేతన్ విశాల్‌ అగర్వాల్‌ (26)కు, సియా గోయల్‌తో పెద్దలు వివాహం నిశ్చయించారు.అయితే ఈ పెళ్లి సియా గోయల్‌కు ఇష్టం లేదు. అప్పటికే ఆమె చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో ఉంది. కుటుంబ సభ్యులు కుదిర్చిన ఈ వివాహం తన ప్రేమకు అడ్డుగా మారిందని భావించిన సియా, ప్రియుడితో కలిసి కేతన్‌ను హత్య చేయాలని పథకం వేసింది.

జూన్ 19న సియా పుట్టినరోజు కావడంతో కేతన్ తన కాబోయే భార్య కోసం లోనవాల సమీపంలోని లోహగడ్ కోటకు ట్రిప్ ఏర్పాటు చేశాడు. ఇదే అవకాశంగా భావించిన సియా అక్కడే కేతన్‌ను హతమార్చాలని ప్రణాళిక రచించింది. చేతన్ కూడా రహస్యంగా అక్కడికి చేరుకున్నాడు.

లోహగడ్ కోటపై ఒక నిర్మానుష్య ప్రాంతానికి కేతన్‌ ఫోటోలు తీస్తున్న సమయంలో సియా, చేతన్ కలిసి అతడిని సుమారు 350 అడుగుల లోతైన లోయలోకి తోసేశారు. తీవ్ర గాయాలు కావడంతో కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే కేతన్ ఫొటోలు తీసుకుంటూ కోటపై నుంచి జారి పడిపోయాడని సియా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

పోలీసులు మొదట ప్రమాద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ విచారణలో సియా చెప్పిన పొంతనలేని సమాధానాలతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. వెంటనే ఆమె మొబైల్ ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా కార్యకలాపాలు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా.. దర్యాప్తులో చేతన్ చౌదరి కూడా ఘటన జరిగిన రోజే కోట వద్ద ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అనంతరం ఇద్దరినీ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రమాద మరణ కేసును హత్య కేసుగా మార్చి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

ఆశ్చర్యకరంగా, ఇది కేతన్ హత్యకు చేసిన తొలి ప్రయత్నం కాదని పోలీసులు వెల్లడించారు. జూన్ 14న ఒకసారి కేతన్‌ను లోయలోకి తోసివేసేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రణాళిక విఫలమైందని తెలిపారు. అంతకుముందే మే 31న లోహగడ్ కోట ట్రెక్కింగ్ సమయంలో హత్యకు సంబంధించిన ఆలోచనను సియా రూపొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.