మహిళలకు చట్టసభల్లో భాగస్వామ్యం బీజేపీ లక్ష్యం

మహిళలకు చట్టసభల్లో భాగస్వామ్యం బీజేపీ లక్ష్యం
- బిజెపి జిల్లా అధ్యక్షులు వేముల నరేంద్ర రావు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: దేశ అభివృద్ధికి మహిళల పాత్ర కీలకమని, వారికి చట్టసభల్లో భాగస్వామ్యం కల్పించడమే బీజేపీ లక్ష్యమని పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు వేముల నరేంద్ర రావు తెలిపారు.
శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. “జన మహిళా ఆగ్రహ సభ” పేరుతో ఈ నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పక్షాలు కుటిలయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. కుటుంబ పార్టీలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు అడ్డుపడ్డాయని విమర్శించారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోందని, అయితే ప్రతిపక్షాలు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు.
2047 వికసిత భారత్ లక్ష్యానికి మహిళలు కూడా పరిపాలనలో భాగస్వామ్యం కావాలని, అధికారంలో వాటా పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేసిందని, కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయని ఆరోపించారు.
బీజేపీ అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, 2023 మహిళా బిల్లులో డిలిమిటేషన్‌తో పాటు అమలు అంశం ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించిందని అన్నారు. మహిళలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర గౌడ్, గగ్గలపల్లి రాము, మహిళా నాయకులు ప్రగతి గౌడ్, జ్యోతి, సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.
