Adilabad | పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో రీల్స్…

Adilabad | పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో రీల్స్…

ఇద్దరు యువకుల అరెస్ట్..!


Adilabad | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : సోషల్ మీడియాలో ‘రీల్స్’ కు యమ క్రేజీ పెరగడంతో యువకులు ఈ మోజులో పడి వినూత్న సాహసాలు చేస్తూ.. ప్రాణాలను కూడా కొని తెచ్చుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇదే కోవలో రీల్స్, షాట్స్ మైకంలో ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని వినియోగించి పోలీస్ బిల్డప్ ఇచ్చిన ఇద్దరు యువకులు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణం (Adilabad town) అంబేద్కర్ నగర్, ఖానాపూర్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం రీల్స్ ప్రదర్శిస్తూ సోషల్ మీడియా మైకంలో హల్చల్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వన్ టౌన్ పోలీస్ ఇన్నోవా వాహనం స్థానిక విమానాశ్రయం మైదానంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వాహనం డ్రైవర్ తో మచ్చిక చేసుకొని రిల్స్ కోసం పోలీస్ వాహనాన్ని ఉపయోగించారు. ఒకడు ముందు సీట్లో నుండి సినీ ఫక్కీలో పోలీసుల బిల్డప్ ఇస్తూ, మరొకరు అదే స్టైల్ లో అనుసరిస్తూ రీల్స్ ప్రదర్శించారు.

ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ (Instagram), ఫేస్ బుక్, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తెగ ఆనందం పొందారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనం రీల్స్ తెగ వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అదిలాబాద్ పట్టణం (Adilabad town) ఖానాపూర్ కు చెందిన షేక్ ఫయాజ్ అనే యువకుడితో పాటు మరో మైనర్ నిందితున్ని ఈరోజు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పెట్రోలింగ్ వాహనం యువకులకు ఇచ్చిన డ్రైవర్ హోంగార్డుపై కేసు నమోదు చేశారు. పోలీస్ పరువు, ప్రతిష్టలను, తమ మనోభావాలను దెబ్బతీసే వారి పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అనుమతి లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే సహించేది లేదని వన్ టౌన్ సిఐ బి.సునీల్ కుమార్ మీడియాకు వివరించారు.

Leave a Reply