స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే స్వేచ్ఛ

మునుగోడు (ఆంధ్రప్రభ): నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి జనగణమన ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలిచి, వారి కన్నీళ్లు తుడిచి, ముఖాల్లో సంతోషం చూడగలిగినప్పుడే స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినట్లవుతుందని అన్నారు.