ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

యడ్లపాడు, ఆగస్టు 15, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా యడ్లపాడు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివరామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తదితర మహనీయుల సేవలు, త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం అంటే కేవలం వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదని, దేశం పట్ల బాధ్యత, రాజ్యాంగం, చట్టాల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగి ఉండటమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, అదే సమయంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించి నేరాల నివారణలో భాగస్వాములు కావాలని కోరారు.

ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, OTP, PIN, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

యువత డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, విద్య, క్రమశిక్షణ, మంచి నడవడికతో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ, ప్రజా ఆస్తులను పరిరక్షిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, సమాజంలో శాంతి, సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఎస్‌ఐ కోరారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.