అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ పతాకావిష్కరణ ఏదీ?

స్వాతంత్ర్య దినోత్సవాన అంబేద్కర్‌ను విస్మరించడంపై గ్రామస్తుల ఆవేదన
ఎన్నికల సమయంలోనే మహనీయులు గుర్తుకొస్తారా? అని ప్రశ్న
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గౌరవించాలని డిమాండ్

వెల్దండ, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య దినోత్సవం అంటే మహనీయుల త్యాగాలను విస్మరించడమేనా? ఎన్నికల సమయంలో మాత్రమే మహనీయులు గుర్తుకొస్తారా? అంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం రాచూర్‌ గ్రామస్తులు ప్రశ్నించారు.

గ్రామంలో 12 మంది వార్డు సభ్యులతో పాటు గ్రామ ప్రథమ పౌరుడు, కార్యదర్శి ఉన్నప్పటికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేవారని తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన సమాన హక్కులు, రాజ్యాంగ స్ఫూర్తితో ఎంతోమంది విద్యావంతులు, మేధావులు ఉన్నత స్థాయికి ఎదిగారని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి విగ్రహం వద్ద స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం ఆయనను అవమానించడమేనని అన్నారు.

ఎన్నికల సమయంలో అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ, నినాదాలు చేసే నాయకులు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయనను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ అందించిన హక్కుల కారణంగానే ఉన్నత స్థాయికి ఎదిగి, రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు ఆయనను విస్మరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

గత దశాబ్దకాలంగా గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించేవారని గుర్తుచేశారు. ఈసారి కార్యక్రమం నిర్వహించకపోవడం రాజ్యాంగ నిర్మాతను విస్మరించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా గ్రామ పాలకులు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను తగిన విధంగా గౌరవించాలని గ్రామస్తులు కోరారు.