పాము కాటుతో యువకుడి మృతి..

జైనూర్, ఆంధ్రప్రభ : బతుకుదెరువు కోసం స్వగ్రామాన్ని విడిచి వెళ్లిన ఓ గిరిజన యువకుడు పాము కాటుకు గురై మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం పంగిడి గ్రామానికి చెందిన కోవ శేకు (28) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా తెలిపారు.

సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోవ శేకు రెండేళ్ల క్రితం ఉపాధి కోసం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నానికి వెళ్లి అక్కడ రాజరాజేశ్వరి కోళ్ల ఫామ్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధుల్లో ఉండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

మృతుడికి భార్య మమతతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబానికి అతడే ఆధారం కావడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని… బాధిత కుటుంబాన్ని కోళ్ల ఫారం యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.

విషయం తెలుసుకున్న పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషాతో పాటు జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, సిర్పూర్ (యు) మండలం బూర్నూర్ (బి) సర్పంచ్ పెందూర్ గణపత్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోలీసులు, వైద్యాధికారులతో మాట్లాడి పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పంగిడి గ్రామానికి తరలించినట్లు తెలిపారు.